ఆత్మ విశ్వాసం, ఆసక్తి విజయానికి తొలి విత్తనాలు!

Image

తక్కువేమి మనకు అనుకోండి! తక్కువే అన్నీ మనకు అనుకోకండి! నేనే చేయగలను అనుకోండి! నేనేం చేయగలను అనుకోకండి! నివురు గప్పిన నిప్పు; చీకట్లో చేసిన తప్పు ఎన్నాళ్ళో దాగవు! అపరాధ భావనతో కుంగిపోయే ఏ తప్పూ చేయద్దు! మీ జీవితంలో తొలి దశలోనే ఒక మార్గదర్శకుణ్ణి (Mentor), మీ ఆత్మ ప్రబోధంతోనే ఎన్నుకోండి! తొలి దశ అంటే, పదవ తరగతి పాస్ అయ్యాక, లేదా ఉద్యోగ జీవితం ప్రారంభ దశలో ఒక మార్గ దర్శకుణ్ణి (Mentor) ఎంచుకోవాలి. ఆయన చెప్పినట్టు మీ ఉద్యోగ జీవితాన్ని(Professional life), వ్యక్తిగత జీవితాన్ని(Personal life) కూడా తీర్చి దిద్దుకోండి! మీ విశ్వసనీయత, పరస్పర విశ్వసనీయతే, మీ మార్గదర్శి (Mentor) ఎంపికకు కొలబద్ద. అప్పుడు అఖండ విజయం మీదే! దీనితోపాటు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల, వివిధ రంగాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆసక్తిని పెంచుకోండి. విజయం సాధించే శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది! పరిశీలనతో పరిణతి వస్తుంది! లోకం పోకడ తెలుస్తుంది! జీవితం ఎలా జీవంతో జీవించాలో తెలుస్తుంది! జీవన నైపుణ్యాలు అలవడతాయి! విజయ సాధనకు విత్తనం ఎక్కడుందో తెలుస్తుంది! అది తెలిస్తే అంతా కరతలామలకమే! నల్లేరు మీద బండి నడకే! విజయోస్తు! సాఫల్య సిద్ధిరస్తు!

Posted in Uncategorized | Tagged , , , | Leave a comment

జాబ్ డెవెలప్ మెంటా? – జేబు డెవెలప్-మెంటా?

Image

ఖచ్చితంగా జాబ్ డెవెలప్ మెంటే! ఎందుకంటే జాబ్ డెవెలప్ మెంట్ తోనే జేబు డెవెలప్ మెంట్! పదిహేను సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగంలో చేరినపుడు ఏ అర్హతతో చేరారో, ఇప్పుడు కూడా అదే అర్హతతో పదోన్నతిని ఎలా డిమాండ్ చేయగలరు? మీరు ఏ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు? మీ ఉద్యోగానికి అవసరమైన ఏ అర్హతలు పెంచుకున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే అర్హతలు తక్కువైనా మనకన్నా ఎక్కువ నైపుణ్యాలున్నవాళ్ళు పెద్ద పదవులు ఎగరేసుకు పోతారు! మీ ఉద్యోగానికి తగిన, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే, మీ ప్రమోషన్లు ఎక్కడికీ పోవు! వచ్చి ఒళ్ళో వాలతాయి! ఆలస్యమెందుకు? అర్హతలు, నైపుణ్యాలు పెంచుకోవడానికి సన్నధ్ధులు కండి! సంసిద్ధులు కండి! ఉద్యుక్తులు కండి! మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోండి! ఎదుటివారిని తప్పు పట్టడం వైఫల్యానికి తొలి మెట్టు! మీ శక్తియుక్తులు తెలుసుకోవడం విజయానికి తొలి మెట్టు! విజయోస్తు! 

Posted in Uncategorized | Tagged , , , , , , | Leave a comment

పర్స్ డెవెలప్-మెంటా, పర్సనాలిటీ డెవెలప్-మెంటా ?

Image

ఇదే ప్రశ్న స్వామీ వివేకానంద, మహాత్మా గాంధీ, థామస్ ఆల్వా ఎడిసన్, స్టీవ్ జాబ్స్ – ఇంకా ఎందరో మానవ జీవితాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహానుభావులు వేసుకుని ఉంటే మనం ఈ రోజు ఇంత సుఖంగా ఉండే వాళ్ళం కాదన్న విషయం మనందరికీ తెలుసు.ఏకాగ్రత పర్స్ మీద ఉన్నంత మాత్రాన పర్స్ నిండదన్న విషయం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు రాక, రోడ్ల మీద తిరిగే ఇంజినీరింగ్, ఎంబీఏ పాసైన విద్యార్ధులనడిగితే తెలుస్తుంది. అరకొర జ్ఞానంతో, తల్లిదండ్రులు తమ దుర్మార్గ దర్శకత్వంతో, పర్స్ ప్రగతే, ప్రగతి అనుకుంటూ పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దుతున్నామనుకుని, పాడు చేసిన ఉదంతాలు కోకొల్లలు! కెరీర్ నిర్మించుకోవడం కాదు కదా, కనీసం ఉద్యోగం కూడా సంపాదించుకోలేక నలిగిపోయే యువత నాకెంతమందో తెలుసు. నా టీవీ కార్యక్రమాలు చూసి, తల్లిదండ్రులు ఫోన్ చేసి, ఇదే విషయం చెప్పుకుని వాపోవడం నితకృత్యం అయిపోయింది. ఎంసెట్టే జీవిత సర్వస్వం అంటూ, కార్పొరేట్ కళాశాలలు ప్రచారంతో ఊదరగొట్టి, తమ పబ్బం గడుపుకోవడానికి, తల్లిదండ్రులను అయోమయంలోకినెట్టి, తమ పిల్లల జీవితాల గురించి, నిర్ణయం తీసుకోలేని స్థితికి చేర్చి, కనీసం తమ పిల్లలకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో కూడా అడగనవసరం లేని పరిస్థితి కల్పించి, చదువు తప్పకుండా కొనుక్కోవలసిన అగత్యం తీసుకొచ్చారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకో తరాన్ని నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు! దయచేసి మీ పిల్లల ఆసక్తి ఏమిటో తెలుసుకుని, చదివించి, వాళ్ళ జీవితాల్లో జీవం నింపండి. పర్స్ ప్రగతి కాదు; పర్సనాలిటీ ప్రగతే నిజమైన ప్రగతి అని తల్లిదండ్రులు తెలుసుకుంటే పిల్లలు బాగుపడతారు! పిల్లలు తమకిష్టమైన చదువులు చదివి,  ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది. సమాజం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రాష్ట్రం సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది. దేశం సంతోషంగా ఉంటే ప్రపంచం సంతోషంగా ఉంటుంది. ప్రపంచమంతా నిజంగా సంతోషంగా ఉంటే సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత వెల్లివిరిసే పిల్లలు, తమలో దాక్కున్న స్టీవ్ జాబ్స్ ని బయటకు తీసుకొస్తారు. కాదంటారా! డబ్బుతోనే సంతోషం అని పిల్లలకు నేర్పి, వాళ్ళను డబ్బులు సంపాదించే యంత్రాల్లా తయారు చేసి, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వాజమ్మల్లా జీవితాంతం వాయిదాలు కట్టడానికి, ఏడుస్తూ ఉద్యోగాలు చేసే చవటల్లా తయారు చేస్తారా! ఇదేనా! మనం పిల్లలకిచ్చే బహుమతి? మీ ఆలోచనలను పిల్లల నెత్తిన రుద్దకండి. వాళ్ళు సొంతంగా ఆలోచించే తెలివితేటలనివ్వండి! పిల్లలూ! మీకు తెలుసా! సైన్సు చదివి మన దేశంలోని విశ్వవిఖ్యాత ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేసే యువత కరువయ్యారని మనందరికీ ఇష్టమైన అబ్దుల్ కలాంగారు వాపోయారంటే, ఎంసెట్ చదువులవల్ల పరిస్థితి  ఎంత దారుణంగా తయారయ్యిందో ఆలోచించండి! అన్ని రంగాలపై సమదృష్టి లేకపోవడం వలన మన దేశ ప్రగతి కూడా అసమగ్రంగా తయారైంది! అందుకే పిల్లలూ!        మీకిష్టమైన చదువులే చదవండి! మీకిష్టమైన చదువులే చదువుతామని తల్లిదండ్రుల దగ్గర మొండికెయ్యండి! చిత్తశుద్ధి, నిబద్ధత, ఏకాగ్రత, నిరంతర ప్రయత్నం, ఫలితం దక్కేదాకా సహనం – ఆధునిక యువత వ్యక్తిత్వ వికాసానికి తొలి సోపానాలు!   అదే ఆధునిక జీవితంలో కనీస వ్యక్తిత్వ వికాసం! మనం వివేకానందులు కానక్కరలేదు! చేతులారా జీవితాలను నాశనం చేసుకునే అవివేకానందులు కాకుండా ఉంటే చాలు! గాడ్ బ్లెస్ యూ!     
Posted in Uncategorized | Tagged , , | 2 Comments

చిత్తశుద్ధితోనే విత్తసిద్ధి !

మరి ఈ నైపుణ్యాలన్నీ కుటుంబాల్లోనే ఉంటే నేర్చుకోవడం ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎందుకంటే అన్ని కుటుంబాల ప్రవర్తన ప్రగతిశీలంగా, వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధికరంగా ఉండదు కాబట్టి వీటిని ఖచ్చితంగా నేర్చుకోవలసిందే. కుటుంబాలెంత విభిన్నంగా ఉంటాయో, వాటిలోంచి సమాజంలోకి వచ్చే వ్యక్తుల ప్రవర్తన కూడా అలా విభిన్నంగానే ఉంటుంది. అందుకే అందరినీ ఒకే గాటన కట్టేయలేం! ఈ విభిన్నత వృత్తిగత జీవితంలో ఎంత దూరం వెళుతుందంటే, ఒకే అర్హత కలిగిన ఇద్దరు వ్యక్తులకు ఒకరికి జీతం ఎక్కువ వస్తుంది;ఒకరికి తక్కువ వస్తుంది! కారణం కేవలం నైపుణ్యాలే కాదు! ప్రవర్తన, ప్రదర్శనా నైపుణ్యాలు (Presentation Skills) కూడా కారణం! అందుకే వీటిని చిత్తశుద్ధితో నేర్చుకుంటేనే వృత్తిలో ప్రగతి! పురోగతి! చిత్తశుద్ధితోనే విత్తసిద్ధి అన్న చిన్న విషయం తెలుసుకోండి మితృలారా!

వీటిని నేర్చుకోవడానికి ఇంకో బలమైన కారణం కూడా చెబుతాను. ప్రపంచీకరణ అనంతరం విశ్వవ్యాప్తంగా ఉన్న కంపెనీలు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎగబడుతున్నాయి. ఒక్కొక్క రంగాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ పోతోంది. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో తొలి దశలో Software పరిశ్రమకు పెద్ద పీట వేసింది. దానితో అంతా MNCల మీద పడ్డారు ఉద్యోగాలకోసం! అక్కడ ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలో ఎవ్వరికీ తెలియదు! మనది మార్కుల చదువుల భారతం కాబట్టి మౌలికంగా జ్ఞాన సూచికగా మార్కులను అధారంగా తీసుకుని ఉద్యోగాలిచ్చేవారు. దానితో ఎందరికో Soft Skills లేకపోయినా Software ఉద్యోగాలు అప్పనంగా దొరికాయి. ఇప్పటికీ అలాగే  దొరుకుతాయన్న భ్రమలో చాలమంది విద్యార్ధులున్నారు. ఈ క్రమంలో ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చి, సాంకేతిక, ప్రవర్తనా నైపుణ్యాలు  నేర్పుతామని సొమ్ము చేసుకున్నాయి. ఇంకా చేసుకుంటున్నాయి! ఎందుకంటే విదేశీ సంస్థలకు మార్కులతోపాటు ప్రవర్తన కూడా చాలా అవసరం. మా ప్రవర్తనకేంటి? మాకు బ్రహ్మాండమైన background ఉంది అని తలెగరేస్తూ ఇంటర్వ్యూకెళితే ఇంతే సంగతులు? మీరు మహాత్మా  గాంధీ మనవడైనా  ఉద్యోగం ఇవ్వాలని రూలేం   లేదు! ఈ రోజుల్లో సిఫార్సు అంటే పెద్ద ఫార్సు! పోటీలో పొట్టేళ్ళుంటాయి! ఏనుగులుంటాయి!  తాడిని తన్నేవాడుంటే; దాని తలదన్నేవాడుంటాడు! దానితో ఉద్యోగం రాదు సరికదా; ప్రతిసారీ నిరుత్సాహపడిపోయి చివరికి ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిస్తేజం ఆవరిస్తుంది! కారణం! MNCలకు కావలసిన నైపుణ్యాలను అవి సాంకేతికమైనా, ప్రవర్తనా  సంబంధమైనా – వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అంటే మీ ఉద్యోగానికి పురిట్లోనే సంధికొట్టేలా మీరే విషబీజం నాటుకోవడం! అందుకే తక్షణం నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నాలను ప్రారంభించండి! మీ ఉద్యోగానికి రాచబాట వేసుకోండి!

Posted in Uncategorized | Tagged | Leave a comment

సాఫల్యానికి రాచబాట సరళ కౌశలాలు!

         Soft Skills అంటే సరళ కౌశలాలు అని ఒక ప్రముఖ దినపత్రిక అనువదించింది. ఇవి మన ప్రవర్తనా సరళికి సంబంధించిన నైపుణ్యాలు కాబట్టి, వీటిని  నేర్చుకోవడం చాల అవసరం. వీటినే కౌటుంబిక నైపుణ్యాలు (Familial skills) అని కూడా   అంటారు. అంటే మన కుటుంబంలోనే ఈ నైపుణ్యాలు ఉంటాయి.  తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా  బయట అలాగే ప్రవర్తిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ పిల్లల్ని పెంచితే, పిల్లలు కూడా LKG నుంచి జీవితాంతం పోట్లాడుతూనే జీవితాన్ని గడిపేస్తారు. తల్లిదండ్రులే పిల్లల ప్రవర్తనా సరళి అభివృద్ధికి తొలి బీజం వేస్తారు. తల్లిదండ్రులు స్వామీ వివేకానంద అంతటి ఆదర్శప్రాయులై ఉండక్కరలేదు. పిల్లల ఎదుట తప్పుగా మాట్లాడటం, తప్పుడు పనులు చేయడం, అప్పుడప్పుడూ తప్పుడు పనులు చేస్తే తప్పులేదనే విధంగా ప్రవర్తించడం, ఉదాహరణకు అబద్ధం చెప్పడం అప్పుడప్పుడూ ఫరవాలేదనేలా సర్దిచెప్పడం చాల తప్పు. ఇలా కుటుంబంలోనే రూపుదిద్దుకునే నైపుణ్యాలు కాబట్టి వీటిని కౌటుంబిక నైపుణ్యాలు (Familial Skills) అని అంటారు. ఈ నైపుణ్యాలు ఇలా ఒకరి నుండి ఒకరికి బదిలీ అవుతాయి కాబట్టి వీటిని బదిలీ అయ్యే నైపుణ్యాలు (Transferable skills) అని కూడా అంటారు. మానవునిలోని పరానుకరణ (imitating others) లక్షణాన్ని ఈ నైపుణ్యాలు పురికొల్పుతాయి. దానితో ఎదుటివారిని అనుకరించి అభివృద్ధి చెందాలనే వాంఛ పిల్లల్లో బలపడుతుంది. ఈ కోరికను సానుకూలంగా, సానుకూల దృక్పధంతో, తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి. ముందు తమ ప్రవర్తనను పిల్లలకోసం సరిదిద్దుకోవాలి. అప్పుడే వారు పిల్లలను సరైన ప్రవర్తనా సరళితో (behavioral patterns) పెంచగలరు. ఇటువంటి తల్లిదండ్రులకు పిల్లలు సాధారణంగా ఎదురు చెప్పరు. తల్లిదండ్రుల ఈ ప్రవర్తనే పిల్లల వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని తీర్చిదిద్దే మూల బీజం! మూలాధారం! పరుసవేది! వారి సాఫల్యాల నిచ్చెనను  సరైన గోడకు ఆనేలా చూసే కీలకం! వారికి సాఫల్య ద్వారాలు తెరిచే బంగారు తాళం చెవి! వారి భావికి పూలబాట! మరి మన జీవితంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన soft skills ఏమిటో, వాటిని ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం.  

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

పుణ్యం కొద్దీ పురుషుడు – నైపుణ్యం కొద్దీ ఉద్యోగం!

 
నైపుణ్యాలలో శిక్షణ పొందండి – పుణ్యం వస్తుంది – సారీ! ఉద్యోగం వస్తుంది!  
 
అసలేమిటీ నైపుణ్యాలు! ఎందుకు వీటి గురించే అందరూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు? అయినా ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు? ఇవి నేర్చుకోకపొతే ఉద్యోగం రాదా? వస్తే ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ వరుసగా చర్చించుకుందాం! 

పుణ్యం కొద్దీ పురుషుడు – నైపుణ్యం కొద్దీ ఉద్యోగం!

ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వ్యాపారం పేరుతో వచ్చి, మన స్వాతంత్ర్యాన్ని హరించి, రెండు వందల ఏళ్ళకు పైగా మన మీద స్వారీ చేసిన విషయం మనందరికీ తెలుసు. దీనివలన మనకు ఏమొచ్చింది? కొంచెం ఇంగ్లీషు వచ్చింది. ఇంగ్లీషులో భారతీయ రచయితలు పుట్టుకొచ్చి వారికి కొన్ని అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు వచ్చాయి. నాడు R.K.Narayan ఒక్కరే ప్రముఖంగా కనిపించేవారు. ఆయన ‘Malgudi days’ TV serial గా కూడా మనందరికీ తెలుసు. నేటి ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయితలలో Salman Rushdie, Vikram Seth, Arundhati Roy, Rohinton Mistry, V.S.Naipaul, Amitav Ghosh, Jhumpa Lahini, Shashi Tharoor, Upamanyu Chatterjee – తాజాగా Chetan Bhagat ఆంగ్ల రచనల్లో భారతీయుల ప్రతిభను, ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేశారు. 

 మరి ఆంగ్ల రచనా నైపుణ్యంలో ఇంతటి ఘనత వహించిన చరిత మన భారతీయులకుంటే, మన ఇంజినీరింగ్,ఎంబిఎ విద్యార్ధులకు ఇంగ్లీషు ఎందుకు రాదు? వారు బి.టెక్.,ఎంబిఎ లాంటి వృత్తిగత చదువులు తెలుగు మాధ్యమంలో చదువుతున్నారా? లేక ఇంగ్లీషు బొత్తిగా రాదా? చాలామందికి లెక్కలంటే భయం!  ఎందుకంటే ఆ లెక్కలు ఇంగ్లీషులో ఉంటాయి. ఇంగ్లీషులో ఉండే లెక్కలు అర్ధం చేసుకోవడం కష్టం. Addition, subtraction, division, multiplication లాంటివి చేయాలని ఇంగ్లీషులో ఉంటాయి. ఇంత చిన్న విషయం అర్ధం కాక కొందరు లెక్కలను అంతటితో వదిలించుకుంటారు. కొందరికి మార్కులు మరీ తక్కువగా వస్తాయి. ఈ గొడవంతా కొంచెం ఇంగ్లీషు మీద ప్రాధమిక విద్యనుండీ దృష్టి పెట్టకపోవడంవల్లనే. ఈ లోపాన్ని సవరించుకోవాలంటే నేటి యువత కేవలం ఇంగ్లీషు చదవడం మీద దృష్టి పెట్టాలి.నిరంతర ఆంగ్ల పఠనాభ్యాసం వల్లనే ఈ లోపం సరిదిద్దుకోగలం. ఆంగ్ల వార్తాపత్రికలు క్రమం తప్పకుండా ప్రతిరోజూ చదవాలి. దీనివలన ఉద్యోగార్హత పరీక్షకు వెళ్ళినపుడు general knowledgeలో మంచి మార్కులు వస్తాయి. Group discussionలో  సునాయాసంగా,  daring గా. Personal interviewలో జెండా పాతేసి offer letter, employer నుండి  లాగేసుకోవచ్చు. మరి ఈ పరిణామ క్రమానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Get ready! 
 
ముందుగా అన్ని నైపుణ్యాలకు మూలమైన, successకి మూలాధారమైన ఈ soft skills అంటే ఏమిటో తెలుసుకుందాం! వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో చూద్దాం!                  
Posted in Uncategorized | Tagged , , , , , , , , | Leave a comment

వ్యక్తిగత వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు!

Image
 
వ్యక్తిత్వ వికాస విశ్వంలోకి సుస్వాగతం!     లక్ష్య శుద్ధి మూలధనంగా… ! 
 
ప్రాచీన సంప్రదాయ పరిరక్షణలో, ఆధ్యాత్మిక సాధనలో, గురు పరంపరారాదనలో, దైవ చింతనలో, పాప చింతలో, అహింసా మార్గానుసరణలో, చివరకు ఆధునిక సాంకేతిక విద్యా రంగాలలో సైతం పురాతన కాలంనుండి నేటి దాకా  భారత దేశాన్ని ప్రపంచమంతా ‘గురుభూమి’గా భావిస్తోంది. వ్యక్తిత్వ వికాసమంటే ప్రపంచానికి గుర్తుకు వచ్చేది మన స్వామి వివేకానంద. అటువంటి వ్యక్తిత్వ వికాస మార్గంలో నేటి యువతను నడిపించేందుకు అంతర్జాలమే సాధనంగా మేము సాగించే చిన్ని ప్రయత్నానికి నాంది ఈ వ్యక్తిత్వ వికాసం.
 
ఒరులేయవి యొనరించిన 
నరవర తన కప్రియమగు తా
నొరులకవి చేయకునికి 
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ !            …. ప్రవర్తనా నైపుణ్యాలు   

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ!    … ఆత్మగౌరవం  

వినదగు నెవ్వరు చెప్పిన 
వినినంతనె వేగపడక వివరింపతగున్ 
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!         …. లిజనింగ్ స్కిల్స్ 

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను 
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మోగునట్లు కనకంబు మోగునా 
విశ్వదాభిరామ వినుర వేమ!                           …. కమ్యూనికేషన్ స్కిల్స్ 

తప్పులెన్నువారు తండోపతండంబులు 
ఉర్విజనులకెల్ల ఉండు తప్పు 
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ!                           … తప్పులెన్ను నైపుణ్యాలు   
 
తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు,త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసు, భర్తృహరి, వేమన, సుమతి శతకకారుడు బద్దెన, అక్కమహాదేవి,కబీర్,  స్వామి వివేకానంద – వీరేకాక ఎందరో మహానుభావులు భరతజాతి వ్యక్తిత్వ వికాసానికి పునాదులు వేశారు. ప్రాత: స్మరణీయులైన వీరిని సభక్తికంగా తలచుకుంటూ మరిన్ని విశేషాలు ప్రస్తావించుకుందాం! ఉదరపోషణార్ధం నేర్చుకునేది, చెప్పేది వ్యక్తిత్వ వికాసం కాదు; కానేరదు. ఉదరపోషణార్ధం ఉపాధికోసం ఎటువంటి నైపుణ్యాలు నేర్చుకోవాలో ఈ బ్లాగులో ప్రస్తావించుకుందాం!  
ఉద్యోగులు, విద్యార్ధులకు కూడా ఉపయుక్తంగా ఉండే నైపుణ్యాలు ఏమిటో తెలుసుకుందాం!       
Posted in Uncategorized | Tagged , , , , , , , , , | 6 Comments