గౌతమ బుద్ధుడు – వ్యక్తిత్వ వికాస సిద్ధుడు

qwNevఈ రోజు బుద్ధుడి గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వికసించిన వ్యక్తిత్వంతో ఆయన అంతఃపురం నుండి అనంత ప్రపంచంలోకి, అన్ని బంధాలు వదలి ఏకాకిగా నడచిన వైనం అందరికీ తెలుసు. సకల దుఃఖాలకు మూలం కోరికలేనని; కోరికలను నియంత్రిస్తేనే సంతోష ద్వారాలు తెరుచుకుంటాయని బుద్ధుడు జీవితాంతం బోధించాడు. ముందుగా తాను ఆచరించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. పూజనీయుడయ్యాడు.

అష్టాంగ మార్గాన్ని బోధించి వ్యక్తిగత వికాసం వ్యక్తిత్వ వికాసం వైపు ఏ విధంగా మళ్ళించాలో విపులంగా చెప్పిన వ్యక్తిత్వ వికాస సిద్ధుడు అంటే తన అనుభవాలతోనే ఆదర్శ వ్యక్తిత్వాన్ని సిద్ధింప చేసుకున్న మహనీయుడు బుద్ధుడు. అనుభవాలే పాఠాలుగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని మార్గదర్శకుడిగా  నిలచిన మహోన్నత స్ఫూర్తి మూర్తి గౌతమ బుద్ధుడు. జీవుడికి, దేవుడికి వ్యక్తిత్వంతో వారధి కట్టి, తానే దేవుడైన జన జీవన రధ సారధి బుద్ధుడు.

గౌతమ బుద్ధుని ప్రస్తావన లేకుండా భారత దేశంలో వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పలేం. నిజానికి బుద్ధుడు సంపూర్ణ, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి మూర్తీభవించిన ఆదర్శ పురుషుడు. ఆధ్యాత్మిక వికాసంతో కూడిన వ్యక్తిత్వమే నిజమైన వ్యక్తిత్వమని ఆచరించి, నిరూపించిన మహనీయుడు బుద్ధుడు. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినంతవరకు భారత దేశం ప్రపంచానికి విశ్వవిద్యాలయం లాంటిది.  ప్రాచీన భారతీయ సాహిత్యమంతా వ్యక్తిత్వ వికాస సాహిత్యమే. భగవద్గీత, భారతం, రామాయణం, వేదాలు, ఉపనిషత్తులు, శతకాలు, సుభాషితాలు, పంచతంత్ర కథలు, అన్నమాచార్య సంకీర్తనలు మొదలైన సాహిత్యమంతా అంతర్లీనంగా మానవ జాతి సమగ్ర ప్రగతికి దోహదం చేసేందుకు తోడ్పడతాయి.

బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని బోధించి వ్యక్తిత్వ వికాస ప్రపంచానికి బలమైన పునాదులు వేశాడు. బౌద్ధ మార్గం పునాదుల మీదే మన జాతి వికాసం చిగురులు తొడిగింది. ప్రపంచీకరణ అనంతరం బహుళ జాతి సంస్థల బహుళార్ధ ప్రయోజనాలే దేశ భవిష్యత్తని పాలకులు భావిస్తున్న ప్రస్తుత తరుణంలో బుద్ధుడి అష్టాంగ మార్గం నేటికీ మనకు దారి చూపిస్తుంది.

కొన్ని అసందర్భమైన స్ఫూర్తిదాయక కథలు, అసమగ్ర ఆలోచనా విధానం శీల నిర్మాణానికి దోహదం చేయలేవు. జ్ఞాపక శక్తి పెంపు వలన ప్రయోజనాలు, సరైన కరచాలనా విధానం, లక్ష్య నిర్ణయం, సమయ నిర్వహణ, సమయ పాలన చిట్కాలు, సానుకూల వైఖరి, భావ వ్యక్తీకరణలో స్పష్టత, నాణ్యత, వ్యక్తిగత అలవాట్లు – ఇవన్నీ ఆసక్తికరంగా అనిపిస్తాయి కానీ జీవిత సాఫల్యానికి, సార్ధక్యానికి  దారి తీసే విజయానికి ఇవి మాత్రమే మెట్లు కాలేవు. నిష్క్రియాపరులను, బద్ధకమే శ్వాసగా జీవించేవారిని మొద్దు నిద్ర నుండి లేపి కార్యోన్ముఖులను చేయాలంటే బుద్ధుని అష్టాంగ మార్గమే శరణ్యం.

ఒక కంప్యూటర్ చక్కగా పని చేయాలంటే దాని ఆపరేటింగ్ సిస్టం బాగుండాలి. శీల నిర్మాణం కూడా ఒక పద్ధతిలో చేస్తేనే, వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.  ఆలోచనలు వికసించి, ఆచరణకు పురికొల్పే అర్ధవంతమైన శీల నిర్మాణ సాధనం బుద్ధుడు బోధించిన  ‘అష్టాంగ మార్గం’.  ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ సత్య బుద్ధుడి అష్టాంగ మార్గం మీద ఎంతో పరిశోధన చేశారు. ‘స్టీఫెన్ కోవె ‘Seven Habits of Highly Effective People’ పుస్తకంలో తన ఆలోచనలను వివరించడానికి ‘Wheel of success’ ని సృష్టించాడు. బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే అష్టాంగ మార్గ చక్రాన్ని సృష్టించి వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం గురించి బోధించాడు’ అంటారు సత్య. బుద్ధుడు బోధించిన తొలి నాలుగు మార్గాలు కనిపించే ఫలాలైతే, అటువంటి ఫలాల ఫలితాలను సాధించడమెలాగో వివరించేవి తక్కిన నాలుగు మార్గాలు. ఆ విధంగా బుద్ధుడు పవిత్రమైన, నిత్య చలనశీలమైన వ్యక్తిత్వ వికాస మార్గంగా, మానవాళి సంక్షేమం, సంపూర్ణ,  సమగ్రాభివృద్ధి కోసం అష్టాంగ మార్గాన్ని బోధించాడు.

బుద్ధుడు బోధించిన ‘వ్యక్తిత్వ వికాసానికి ఎనిమిది మార్గాలు’ ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ పరస్పర ఆధారాలు. అన్నీ ఆచరిస్తేనే వ్యక్తిత్వ వికాస ఫలాలు లభిస్తాయి.

  1. సరైన దృష్టికోణం అంటే జీవితం పట్ల సానుకూల దృక్పథం. ఇది కేవలం వ్యక్తిత్వ వికాస శిక్షకులు బోధించే positive attitude కాదు. లోతైన దృష్టికోణం, దృక్పథం ఉండాలంటాడు బుద్ధుడు.
  2. విస్పష్ట లక్ష్యం అంటే సాటి మనిషి ప్రయోజనాలను, మనం నివసించే సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీవిత లక్ష్యాలను నిర్దేశించు కోవాలి. అలా నిర్దేశించుకుని బుద్ధుని మార్గాన్ని అనుసరించడం వల్లనే అంబేద్కర్ అఖండ భారతం ఆమోదించే స్థాయిలో రాజ్యాంగాన్ని రచించగలిగారు.
  3. భావ వ్యక్తీకరణలో స్పష్టత ఉండాలి. భాషకి, మాటకి, ఆలోచనకి సమన్వయం ఉండాలి.
  4. సత్ప్రవర్తన అంటే సామాజిక మర్యాదలు, పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం, ముందు ఎదుటివారికి అనుకూలంగా ప్రవర్తించడం, ఆ తర్వాతే మన పని మీద దృష్టి పెట్టడం.
  5. ఎదుటివారిని నొప్పించకుండా, సమాజానికి హాని చేయకుండా ధర్మ మార్గంలో జీవనోపాధిని సంపాదించుకోవడం.
  6. విజయ సాధనకు సరైన ప్రయత్నాలు చేయడం. అంటే మన ప్రయత్నాలన్నీ ఇతరులకు హాని కలిగించకుండా ధర్మానుగుణంగా తీర్చిదిద్దుకోవడం.
  7. ఏకాగ్రత. అన్ని వివరాల పట్ల, ఆచరణా విధానం పట్ల దృష్టి పెట్టడం వలన ఏకాగ్రతతో విజయ తీరాలను చేరవచ్చు.
  8. ఆత్మానందం. ఎవ్వరూ ఆటంకం కలిగించలేని అద్భుత సంతోషంతో జీవితాన్ని మహోత్సవంలా ఆస్వాదించడం. Enjoying the bliss of life which is the result of our sincere efforts.

మానవ జాతి వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాన్ని  ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ఆచరించాలి. జాతి, కుల, వర్ణ, వర్గ విభేదాలతో, కక్షలతో, కార్పణ్యాలతో సతమతమయ్యే సమాజంలో శాంతి స్థాపనకు సైతం బుద్ధుని అష్టాంగ మార్గమే అవశ్యం ఆచరణీయ మార్గం.

* * *

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s