క్రాంతదర్శి అన్నమయ్య – మన భావికి మార్గదర్శి

annamayya-psనేనొక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరిగింది. సాధారణంగా జరిగే సంబరాలన్నీ జరుగుతున్నాయి. నృత్య వాద్య సంగీత ఘోషలతో, ఘోషణలతో ప్రాంగణమంతా మార్మోగిపోతోంది. సందడంతా యువతరం రూపం దాల్చి ఊగిపోతోందా అనిపిస్తోంది. తెర వెనుక కార్యక్రమ నిర్వహణలో తలమునకలై ఉన్న నా దగ్గరికి ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చి ‘నమస్కారం మాస్టారు ‘ అన్నారు. తల ఊపి వాళ్ళవైపు చూస్తే ఇద్దరూ నా ప్రియ శిష్యులు. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నట్టు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నట్టు చెప్పారు. ఏదో తెలియని దిగులు వాళ్ళ ముఖం మీద దోబూచులాడుతోంది. ‘I am very happy’! సంతోషంగానే ఉన్నారు కదా! అని పలకరించాను. ‘ఏం సంతోషం మాస్టారు? ఉదయాన్నే ఉద్యోగాలకు పరుగెత్తాలి. ఎవ్వరు ఉద్యోగం చెయ్యకపోయినా ఇల్లు గడిచే పరిస్థితి లేదు. కోరి కొనుక్కున్న విల్లా, కారు, అవీ, ఇవీ అన్నింటికీ వాయిదాలు కట్టాలి. చివరికి మీరు ఎప్పుడో చెప్పినట్టు వాయిదాలు కట్టడానికే ఏడుస్తూ ఉద్యోగాలకెళుతున్నాము. మా జీవితమనే ప్రాజెక్టును సంతోషాల విత్తనాలు పండించే ఫల వృక్షంలా కాకుండా, కోరికల పునాదుల మీద నిర్మించుకున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం’ అన్నారు. నేను ఆలోచనల్లో మునిగిపోయాను. వ్యక్తిత్వ వికాసమంటే కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకుని, కావలసినంత డబ్బు సంపాదించుకుని జీవితమనే కోరికల ఊరేగింపులో కలసిపోవడం కాదు. లక్ష్య సాధన మీద మనసు లగ్నం చేసి, ఆ కృషిలో విజయ శిఖరాలు చేరుకున్నప్పుడు ధనలక్ష్మి మీ వెంట పరుగెత్తుకుంటూ వస్తుంది. ధనలక్ష్మి వెంట మీరు కోరికల గుర్రాలెక్కి పరుగెడితే ఆవిడ మీకు చిక్కకుండా పారిపోతుంది. అందుకే తాళ్ళపాక అన్నమాచార్యులవారు చదువు సంధ్యలెలా ఉండాలో, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఒక చక్కని సంకీర్తనలో వివరించి చెప్పారు.

కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై పడని పాట్లనెల్ల పడిపొరలనేల?

ఈ కడుపెంత తింటుంది? దీనికోసం ఎన్ని పాట్లు పడుతున్నాం? ఎంత కష్టపడుతున్నాం అన్న ఒక ఆలోచనా బీజాన్ని మనలో నాటి అన్నమయ్య ఈ సంకీర్తనతో మనల్ని ఎటు తీసుకెళుతున్నారో చూద్దాం.

పరుల మనసునకు ఆపదలు కలుగగ చేయ పరితాపకరమైన బతుకేల?

సొరిది ఇతరుల మేలు చూసి సైపగ లేక తిరుగుచుండే కష్ట దేహమది యేల?

ఎప్పుడూ ఎదుటివారి మనసును నొప్పించే పనులు చేస్తూ, ఏడుస్తూ బతకడమెందుకు? ఇతరులకు జరిగే మేలు చూసి ఏడుస్తూ, ఈ దేహాన్ని మోసుకుంటూ తిరగడమెందుకు? ‘Help Ever; Hurt Never’ అన్న సత్య సాయి అమృత వాక్కుల సారాంశం 15వ శతాబ్దంలోనే అన్నమయ్య చెప్పారు. ఆలోచనకు ఆచరణకు మధ్య అంతరం పెరిగితే వ్యక్తిగత వికాసం; అంతరం తగ్గిన కొద్దీ వ్యక్తిత్వ వికాసం.

ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పనియట్టి చదువేల?

పొదిగొన్న ఆసలో బుంగుడై సతతంబు సదమదంబై వడయు చవులు తనకేల?  

చదువెలా ఉండాలో అన్నమయ్య ఈ చరణంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఎదిరికి అంటే శత్రువుకు కూడా ఉపకారము చెయ్యాలని చెప్పని చదువెందుకు? అంటున్నారు అన్నమయ్య. ‘అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ’ అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. ఇంతటి సత్యాన్ని అన్నమయ్య 15వ శతాబ్దిలోనే చెప్పాడు. ఇటువంటి చదువులు ఇప్పుడు చెప్పకుండా, అంతా వ్యాపారమయం చేయడం వల్లనే కదా ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష’ అనుకుంటూ ప్రపంచమంతా డబ్బు వెంబడి పరుగులు తీస్తూ, లోపలి అంతర్గత శక్తిని, అంతరంగ శక్తిని, లోని నైపుణ్యాలను పెంచుకోకుండా కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి పరుగులు తీస్తోంది? రాశులు పోసిన ఆశలలో మునిగిపోయి ఎప్పుడూ సతమతమయ్యే చదువులెందుకు? ‘స్వగృహే పూజ్యతే పితర; స్వగ్రామే పూజ్యతే ప్రభు; స్వదేశే పూజ్యతే రాజా; విద్వాన్ సర్వత్ర పూజ్యతే ‘ అంటే ఒక తండ్రిని తన ఇంట్లోనే పూజిస్తారు; ఒక ప్రభువును తన గ్రామంలోనే పూజిస్తారు; ఒక రాజును అతని దేశంలోనే పూజిస్తారు; కానీ విద్వాంసుడిని అన్ని చోట్ల పూజిస్తారు’  అంటే విద్వత్తు ఉన్నవాడిని ప్రపంచమంతా గౌరవిస్తుంది అని తాత్పర్యం. అటువంటి విద్వత్తును విద్యుత్తులాగా దేహంలోకి, మనసులోకి, హృదయంలోకి ఆవాహన చేసుకుని, అవగాహనతో బతకడమే మానవ జీవిత లక్ష్యం కావాలని అన్నమయ్య పద సారాంశం.

శ్రీ వేంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతిపడు సిరులేల?

దేవోత్తముని ఆత్మ తెలియనొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనంబేల?  

అన్నమయ్య పద లక్ష్యం, లక్షణం, ధ్యేయం, మార్గం, తత్పరత, తాత్పర్యం అన్నీ ఆ వేంకటేశ్వరుడే. ఎవరి లక్ష్యం వారికి వేంకటేశ్వరుడు. ఎవరి లక్షణం వారికి ఈశ్వరుడు. ఎవరి తాత్పర్యం వారికి వారి వారి జీవన భాష్యం. ఒకరు చెప్పినట్టు మరొకరు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోలేరు. వారి వారి జనన జన్యు బీజాలను బట్టి, జన్మ సంస్కారాన్ని బట్టి వారి వారి ఆలోచనల సమాహారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. అనుభవాలు దిక్సూచులుగా జీవితాలను జీవిస్తారు. తాము జీవించేదే జీవితమనుకుంటారు. ఎవరైనా వెదికేది జీవితంలో సంతోషం కోసమే. తమదే సంతోషమని జీవిస్తూ ఉంటారు. అనిర్వచనీయమైన వాటికి నిర్వచనాలివ్వడానికి ప్రయత్నిస్తారు. చివరకు వాయిదాల పద్ధతిలో జీవిస్తూ; తామే ఉద్ధతులమనుకుంటారు. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ నుండి ధనలక్ష్మిని మాత్రం వెంటాడుతూ అజ్ఞానం బ్రహ్మమనే మాయలో పడిపోతారు. ఇవన్నీ వేదాంత సంబంధమైన పదజాలం, పదాడంబరం కాదు. విషయ తీవ్రతను అర్ధం చేసుకోగలరనే ఉపయోగించాను. కొన్ని తరాలను నాశనం చేసే విద్యా విధానాలు, జాతులను సైతం నాశనం చేసే రాజకీయ సిద్ధాంతాలు, కేవలం జీవనోపాధి కోసమే విద్య అనుకునే అజ్ఞానం – ఇవన్నీ అన్నమయ్య ఏనాడో తెగనాడాడు. వేంకటేశ్వరుడొక శిఖరం. మనలోని కోరికల కొండలు దాటితే ధనలక్ష్మితో సహా దర్శనమిచ్చేది, మనం సాధించాలనుకునే శిఖరం. అంతటి శిఖరాన్ని జీవిత కాలంలో సాధించాలంటే ఎటువంటి చదువు చదవాలి? కేవలం పొట్ట కోసం, ధనం కోసం విలువైన జీవితాన్ని వృధా చేసుకోవాలా? అనుబంధాలు పెంచుకుంటూ అర్ధమే పరమార్ధమని ఒక్కరు నలుగురయ్యే కుటుంబం కోసం జీవితాన్ని పణంగా పెట్టి, వాయిదాలు మాత్రం కట్టి జీవించే రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలా? పర హితమే తన హితమని జీవితాన్ని ఉత్సవంలా జీవించాలా? Life is a celebration.  జీవితమొక మహోత్సవం. ప్రతి నిత్యం వసంతోత్సవం. ఇంత నిర్మలంగా జీవితాన్ని జీవించాలంటే వాగాడంబరాల భ్రమలో పడకుండా మనలోని నైపుణ్యాలను అనుక్షణం తవ్వుకుంటూ, నలుగురిలో బతుకుతూ, నలుగురికీ ఉపయోగపడేలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మన చుట్టూ సమాజ సర్వేశ్వర స్వరూపంలో వెలిగే వేంకటేశ్వరుని సేవా రతిలో లీనమవ్వాలి. ఈ దేహాన్ని అటూ ఇటూ తిప్పుతూ అనవసరమైన తిప్పలు పడకుండా, ఆత్మ శక్తిని తెలుసుకుని మసలుకోవాలి. మన మనోసంద్రంలో దాక్కున్న మణులను మనమే వెతికి, వెలికి తీసుకుని సాటి జీవి వేదనలు తీర్చే మహా యజ్ఞంలో మహోధృతంగా నిమగ్నమవ్వాలి. జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

కేవలం జీవనోపాధికి మార్గం చూపేది వ్యక్తిగత వికాసమే అవుతుంది కానీ వ్యక్తిత్వ వికాసం కాదు. మాటలెన్ని కోటలు దాటినా దారి చూపు వారు మనీవైపు దారి చూపిస్తే అది యువతరాన్ని పెడతోవ పట్టించినట్టే అవుతుంది. లక్ష్యమెప్పుడూ ఘనంగా ఉండాలి. ధనంగా ఉండకూడదు. ధన లక్ష్యంతో జీవితం పరిభ్రమిస్తున్నప్పుడు, అది విఘాతమవుతుంది  కానీ వికాసం కాదు.

బాల్యం నుంచి యవ్వనం దాకా మన పిల్లలు చదువుకునే చదువులో ఎప్పుడైతే శీల నిర్మాణ విద్యను సమూలంగా నిర్మూలం చేసి, వాణిజ్య విలువలతో విద్యను ప్రారంభించామో అప్పుడే జాతి వ్యక్తిత్వ వికాస నాశనానికి విష బీజం పడింది. దాని పరిణామాలు మనందరం చూస్తున్నాం. ఇటువంటి ఆలోచనా రహిత దుస్థితి నుంచి యువతరాన్ని బయట పడేయడమే నేటి వ్యక్తిత్వ వికాస మార్గ దర్శకుల లక్ష్యం కావాలి. దానికి మన భారతీయ సాహిత్యమే తరిగిపోని బంగారు నిధిగా ఉపయోగపడుతుంది. శతక సాహిత్యం, సంకీర్తనా సాహిత్యం, కథా సాహిత్యం, గేయ సాహిత్యం – వీటిని అన్ని పాఠశాలల్లో బోధనాంశాలుగా పునరుద్ధరించాలి. అప్పుడే యువత ఆత్మ విశ్వాసంతో, దృఢమైన వ్యక్తిత్వ వికాసంతో విలసిల్లుతుంది. వర్ధిల్లుతుంది. ఆ బంగరు రోజులు మళ్ళీ రావాలని ఆశిద్దాం. ఆకాంక్షిద్దాం.

* * *

 

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized and tagged , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s