కృతజ్ఞతలోనే విజ్ఞత

 

‘There is attitude in Gratitude’. కృతజ్ఞతలోనే విజ్ఞత ఉంది. ఒక చిన్న మాట అద్భుతాలు చేస్తుంది. లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుంది. ఎదుటివారిని ప్రభావితం చేయడానికి పరిచయాలు అవసరం లేదు. అతడు మీ శత్రువైనా కావచ్చు. మీ పై అధికారులు, సహచరులు, సమాన స్థాయిలో ఉన్నవారు, మీ కింద పనిచేసే వాళ్ళు – ఎవరైనా సరే మీకు కొంచెం ఏ విధంగానైనా, మాట సాయమైనా, మనీ సాయమైనా చేస్తే కించిత్ ఆలస్యం చేయకుండా తక్షణం మీ కృతజ్ఞత తెలియచేయండి. ‘Thanks’ అనే చిన్న మాట జీవితంలో అద్భుతాలు చేస్తుంది. కృతజ్ఞత తెలిపినవారిలో, అందుకున్నవారిలో కూడా అది ఆహ్లాదానికి, ఆనందానికి, మార్పుకు దోహదం చేస్తుంది. అదే  విధంగా ఒక చిరునవ్వు, చిత్తశుద్ధితో కూడిన చిన్న అభినందన అనంతమైన స్ఫూర్తినిస్తుంది .  ‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును; లోకము మెచ్చును’  అంటారు అన్నమాచార్యులు. కృతజ్ఞత మానవ    సంబంధాలను పటిష్టం చేస్తుంది. అనాయాసంగా విజయం వైపు ప్రయాణించడానికి ఇంధనంలా పని చేస్తుంది.

‘Gratitude is not only the greatest of virtues, but the parent of all the others.’  అంటాడు మార్కస్ టుల్లియుస్ సిసిరో. కృతజ్ఞత అన్ని ధర్మాలలోకి గొప్పది. ధర్మాలన్నింటికి తల్లిదండ్రుల లాంటిది. అనాధ బాలుడిని అని బాధపడే కర్ణుడిని దుర్యోధనుడు మహారాజుని చేశాడు. అందుకు కృతజ్ఞతగా కర్ణుడు  జీవితాంతం దుర్యోధనుడి కొలువులోనే ఉన్నాడు. చివరకు స్వధర్మం కోసం, స్నేహం కోసం తన కవచ కుండలాలను సైతం త్యాగం చేశాడు. కర్ణుడు మూర్తీభవించిన కృతజ్ఞత.రాఖీ పండుగ సందర్భంగా పురుషోత్తముడి భార్య అలెగ్జాండర్ కు రాఖీ కట్టింది. అందుకు కృతజ్ఞతగా  అలెగ్జాండర్ పురుషోత్తముడిని అతని భార్యకు అప్పగించాడు. తాము పొందిన సాయాన్ని వీరెప్పుడూ మర్చిపోలేదు. పైగా తక్షణం స్పందించి తమ కృతజ్ఞత తెలియచేశారు. అందుకే చరిత్రలో నిలిచిపోయారు. మన మంచితనమే ఎదుటివారికి స్ఫూర్తినిచ్చి వారిలో కృతజ్ఞతా భావాన్ని పెంపొందింప చేస్తుంది.

‘Thank you’ అనే చిన్న మాట మనుషుల ప్రవర్తనలో పరివర్తన తీసుకొస్తుంది. రైల్వే స్టేషన్ లో మీ సామాన్లు మోసిన ఒక కూలి కానీ, ట్యాక్సీ డ్రైవర్ కానీ మీకు ‘Thanks’ చెపితే తక్షణం మీలోని ‘ దాన కర్ణుడు’ నిద్ర లేస్తాడు. మీకు అయిన బిల్లు కంటే మరో పది రూపాయలు ఎక్కువిచ్చేస్తారు. తమ లక్ష్యాలు సాధించాలనుకునేవారికి సామాజిక సంబంధాలు చక్కగా నిర్వహించడం ఎంతో అవసరం.  ‘ఇంటికి నాలుగు వైపులా తలుపులున్నాయి. కనీసం ఒక తలుపునైనా ఎప్పుడూ అదృష్ట దేవత తడుతూ ఉంటుంది. ఆ తలుపును గుర్తించి తెరిచిపెడితే అవకాశం మీ గుమ్మంలో ఉంటుంది.’ అని ఒక చైనా సామెత.

కృతజ్ఞత మనుషుల మధ్య బంధాలను, సంబంధాలను పటిష్టం చేస్తుంది. ప్రతి ఉద్యోగి యాజమాన్యం పట్ల కనీస కృతజ్ఞత కలిగి ఉండాలి. ‘మన ఉద్యోగ జీవితంలో ఒక భాగమైన మనం పని చేసే కంపెనీ ఎప్పుడూ చల్లగా ఉండాలని ప్రతి రోజు దేవుడిని  ప్రార్ధించాలి’ అని మా బాస్ చెపుతూ ఉండేవాడు. కంపెనీ బాగుంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇదే మన భారతీయతలోని విశిష్టత. ‘వసుధైవ కుటుంబకం’ – ప్రపంచమంతా ఒక కుటుంబమనే భారతీయ తత్వ జ్ఞానమే భారతదేశాన్ని ఇతర దేశాలకు గురు స్థానంలో నిలబెట్టింది. అదే మన కృతజ్ఞతా వ్యక్తీకరణలో ప్రతిఫలించే తత్త్వం. అందుకే కృతజ్ఞత ధర్మాలలోకెల్ల విశిష్ట ధర్మం. జాతి, వర్ణ, వర్గ, కుల, మతాలకు అతీతమైనది కృతజ్ఞత. నిరంతర మానవ సంబంధాలకు చక్కని విత్తనం కృతజ్ఞత. కృతజ్ఞత లేని జాతి కుళ్లిపోతుంది. కృతజ్ఞత లేని జాతికి భవిష్యత్తు లేదు.

భగవంతునికి కృతజ్ఞత తెలియచేయడం అన్ని మతాలలో వివిధ పద్ధతుల్లో అనాదిగా ఉండనే ఉంది. ‘Thanks giving’ క్రైస్తవ మతంలో ప్రత్యేకంగా ఉత్సవంలా జరుపుకుంటారు. ఒక మంచి జరిగితే ప్రత్యేకంగా పత్రికలలో ‘Thanks giving’ ప్రకటనలు కూడా ఇస్తారు. ముస్లింలు కృతజ్ఞతగా ఉపవాసాలుండి అల్లా ఇచ్చిన అద్భుత జీవితం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తారు. ఇక హిందువులు వివిధ దేవుళ్ళకు కృతజ్ఞతగా, తమ కోర్కెలు తీరితే మొక్కులు చెల్లించుకుంటారు.

ఈ క్రింది సందర్భాలలో కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. మర్చిపోకండి. ఇది మీ మంచి అలవాట్లకు తొలి పునాది. మీ చక్కని భవిష్యత్తుకు నాంది.

  • చిన్న సాయం పొందినా కృతజ్ఞతలు చెప్పండి.
  • సాయం చేసినవారు మీ కంటే వయసులో చిన్నవారైనా ‘Thanks’ చెప్పడం మర్చిపోవద్దు.
  • భార్యా భర్తలు కూడా ఎప్పటికప్పుడు పరస్పరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వివాహ బంధంలో అహంకారం అజ్ఞానానికి, వైఫల్య ధోరణికి నిదర్శనం. చిరునవ్వే ఈ బంధంలో శిఖరమంత కృతజ్ఞత. అదే విజ్ఞత.
  • అవసరమైనపుడు సాయం చేసిన స్నేహితులకు కృతజ్ఞత చూపించాలి.
  • మీకు సాయం చేసిన వారికి జాతి, మత, వర్ణ, వర్గ, కుల విచక్షణ లేకుండా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. వారు ధనికులైనా, స్నేహితులైనా, సన్నిహితులైనా కృతజ్ఞత చెప్పడంలోనే మీ విజ్ఞత ఉంది.

ద్వేషాన్ని కృతజ్ఞతతో అనాయాసంగా జయించవచ్చు. ఎదుటివారిమీద మీకు ఎటువంటి అభిప్రాయమైనా ఉండవచ్చు. ‘కృతజ్ఞత’ వ్యక్తం చేయడంలోనే మీ విజ్ఞత ప్రస్ఫుటమవుతుంది.  ఎదుటివారికి సాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ‘కృతజ్ఞత’ వ్యక్తం చేయడం ఒక సహజ లక్షణంగా మనం అలవాటు చేసుకోవాలి.’Thanks’ చెప్పడం పొరపాటున కూడా మర్చిపోకూడదు.

‘కృతజ్ఞత’ జీవితంలో సంపూర్ణత్వానికి ద్వారాలు తెరుస్తుంది. మన దగ్గర ఉన్న దానిని మనకు తగినంత చేస్తుంది. సమృద్ధిభరితమైన జీవితాన్నిస్తుంది. తిరస్కారాన్ని అంగీకారంగా, గందరగోళాన్ని ఒక పద్ధతిగా, అస్పష్టతను స్పష్టతగా చేసే శక్తి కృతజ్ఞతకు  ఉంది. మన గతానికి ఆమోదాన్ని, వర్తమానంలో మనశ్శాoతిని ఇచ్చి భవిష్యత్తుకు మార్గ దర్శనం చేస్తుంది.’ అంటారు ‘Co-dependent No More’ అనే తన పుస్తకంలో రచయిత్రి మెలోడి బీట్టీ.

భగవంతుడు ఈ రోజు మీకు 86,400 సెకండ్లు బహుమతిగా ఇచ్చాడు. ఒక్క సెకనైనా ‘కృతజ్ఞత’ వ్యక్తం చేయడానికి,  ‘Thank you’ చెప్పడానికి ఉపయోగించారా? అంటాడు విలియం ఎ. వార్డ్.

‘కృతజ్ఞత’ ఎప్పుడూ హృదయం లోతుల్లోంచి వ్యక్తం చేయండి. ‘కృతజ్ఞత’ నాలుక మీద మాట కాదు. ఎదుటివారి పాదాల మీద మనం గుండె కింద తడితో, కృతజ్ఞతా భారంతో ఉంచే పుష్ప గుచ్ఛ౦. మీ ప్రవర్తనే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే అద్దం. అది మీ దృక్పధానికి, వైఖరికి అద్దం పడుతుంది. గుర్తుంచుకోండి. కృతజ్ఞత వ్యక్తం చేయడంలోనే విజ్ఞత ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పరివర్తన తీసుకొచ్చే శక్తి మీ ప్రవర్తనలో ఉంది. అది ఈ సమాజంతో మీ సంబంధాలను విస్తృతం చేస్తుంది. మీ అప్రతిహత విజయాలకు అనితర సాధ్యమైన బంగారు బాట వేస్తుంది.

* * *

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s