కమ్యూనికేషన్ ఎందుకు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

ఎందుకంటే, జీవితంలో విజయం సాధించడానికి ఈ నైపుణ్యమే కీలకం! వృత్తిగత జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ విజయ శిఖరాలు అధిరోహించాలంటే సంభాషణా నైపుణ్యాన్ని కాచి వడపొయ్యాలి. ఇంతకూ ఇదేమిటి? కమ్యూనికేషన్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మౌఖికం (Verbal), రెండు దైహికం (Non-Verbal) అంటే దేహానికి సంబంధించినది. దేహ భాష (Body language)అంటారు. మౌఖిక భాషకి, దేహ భాషకి సమన్వయం లేకపోతే,ఎదుటివారి మాటల తడబాటుని మనం ఇట్టే గమనించవచ్చు. ఆ తడబాటు కంగారు వల్లనైనా కావచ్చు; తెలియని విషయమైనా కావచ్చు; లేదా అబద్ధం చెప్తుండవచ్చు. ఈ భావ ప్రకటన ఖచ్చితంగా ఏమిటో మనకు అనుభవంతోనే బోధపడుతుంది. ఈ దేహభాషనే ఆంగ్లంలో Kinetics లేదా Kinesthetics అంటారు. ఆంగికం లేకుండా, వాచికంతోనే సాధారణంగా ఎవరూ భావప్రకటన చేయరు. కేవలం రేడియో ప్రయోక్తలు తప్ప! మన ఎదురుగా ఎవరైనా నిలబడి మాట్లాడుతుంటే, వారితో సాధారణంగా కాళ్ళో, చేతులో ఊపుతూ మాట్లాడుతుంటాం. కళ్ళు ఎగరేస్తూ ఉంటాం. చేతులు తిప్పుతూ ఉంటాం. చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడతాం.చేతులు వెనక్కి పెట్టుకుని మాట్లాడతాం. పెదాలు కొరుకుతూ, వంకరగా నవ్వుతూ మాట్లాడతాం. నోటికి చేతులు అడ్డం పెట్టుకుని మాట్లడతాం. ఇవన్నీ దేహ భాషలో భాగమే! మన కమ్యూనికేషన్ నైపుణ్యంలో అంతర్భాగమే. ఇక్కడో అద్భుతమైన తెలుగు సామెత గుర్తుకొస్తోంది.. ‘నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడం’ అంటుంటారు. కొంతమంది మామూలుగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ వారి ముఖంలో భావాలు, మాటలకనుగుణంగా ఉండవు. ఆ మాటల్లో వ్యంగ్యం తొణికిసలాడుతూ ఉంటుంది. వెక్కిరింత ఉంటుంది. వెటకారం ఉంటుంది. ఈ విధంగా మాట్లాడటం వారిలోని ఆత్మన్యూనతకు ఆనవాలు. వీరు వాదించడంలో దిట్టలు. ఇటువంటివారిని గమనించే నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్  ‘The Argumentative Indian’ అనే పుస్తకం రాసుంటారు. ప్రతిదానికీ నొచ్చుకోవడం తప్పితే, మెచ్చుకోవడం అనేది వీరి జాతకంలోనే లేదు. ఇటువంటి వారిని సరిగా అర్ధం చేసుకోవాలంటే వారి మాటలకు, దేహ భాషకు పొంతన, సమన్వయం ఉందో లేదో గమనించాలి. ఇటువంటి వారితో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరితో మాటలు రెచ్చగొట్టే విధంగా (Provocative Communication) ఉండరాదు. చిచ్చికొట్టే విధంగా ఉండాలి. అంటే మాట్లాడే శైలి  సుతి మెత్తగా, మెల్లగా, పనికి సంబంధించినదిగానే (Proactive Communication) ఉండాలి గానీ, అనవసరంగా సంభాషణ పొడిగించకూడదు. ఆపుడే వీరితో మనకి కావలసిన పని చేయించుకోగలం. వృత్తిగత జీవితంలోగానీ, వ్యక్తిగత జీవితంలో గానీ విజయం సాధించడానికి ఇదే కీలకాంశం. అందుకే మనం మనుషుల్ని మార్చలేం, వారితో మనం వ్యవహరించే శైలిని మార్చుకుని, వారి వైఖరిని మార్చుకోగలిగితే చాలు. చక్కగా వారితో పని చేయించుకోవచ్చు.    ‘We cannot change people in 21st Century, but we can change their attitude and get the things done.’ ’21వ శతాబ్దంలో మనం మనుషుల్ని మార్చలేకపోవచ్చు; కానీ వారి వైఖరిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు ‘ అంటాడొక మానసిక శాస్త్రవేత్త.  అంటే మనుషుల వైఖరిని మార్చి, వృత్తిగత జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ మనకు కావలసిన పనులు చేయించుకోవచ్చు. అటువంటివాళ్ళే కార్య నిర్వాహక స్థాయి (Managerial level) నుండి కార్యసాధక స్థాయికి (Leadership level) చేరుకుంటారు. ఇది వారి సాఫల్య వైఖరికి (Progressive Attitude) అద్దం పడుతుంది. మరి మనుషుల వైఖరి మార్చడం ఎలా? మిలియన్ డాలర్  ప్రశ్న కదా? దానికి ఒకటే దారి! ముందు వారికిష్టమైన  పని చేయనివ్వాలి. ఆ పనిలో వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, తదనుగుణంగా వారికిష్టమైన పని మనకు కావలసిన రీతిలో చేయించుకోవాలి. అప్పుడు వారిలో ఉత్పాదక వైఖరి (Productive Attitude) అనూహ్య స్థాయిలో పెరుగుతుంది. ఎప్పుడైతే వారిలో ఉత్పాదక వైఖరి క్షణ క్షణం వర్ధిల్లుతుందో, వారి సాఫల్య స్థాయి (Progressive Attitude) ద్విగుణీకృతం అవుతుంది. ఉదాహరణకు ఏ కళనైనా తీసుకోండి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం! ఏ కళనైనా, ఎవరైనా ప్రాధమిక స్థాయి నుండి నేర్చుకుని, పరిణత స్థాయికి చేరుకుంటారు. ఇది అనితర సాధ్యమైన తపనతో కూడిన సాధనతోనే సాధ్యం. ఒకసారి కళ పట్టుబడిన తర్వాత దానితో మనం ఊడిగం చేయించుకోగల స్థాయికి చేరుకుంటాం. మన స్వర రాగ ప్రావీణ్యంతో ఏ పాటనైనా అవలీలగా పాడగలం. సాహితీ ప్రకర్షతో ఏ భావాన్నైనా అక్షరాల్లోకి అనువదించగలం. చిత్రలేఖనా ప్రావీణ్యంతో ఏ చిత్తరువునైనా జనం బిత్తరపోయేలా చిత్రించగలం. ఇదే మనిషిలోని ఉత్పాదక వైఖరికి గుర్తు! ఈ నైపుణ్య స్థాయిని అనన్య సాధ్యమైన సాఫల్య స్థితికి తీసుకెళ్ళే పరుసవేది మన నిపుణ సంభాషణా వైఖరి.  ఏ కళకైనా తమ ప్రతిభతో రూపునిచ్చేవారికి, ఏ కలకైనా తమ పట్టుదలతో రూపుదిద్దేవారికి నిపుణ సంభాషణా వైఖరే విజయానికి విత్తనం!  ఇదే సానుకూల సంభాషణా నైపుణ్యానికి, ఎదుటివారిలో సానుకూల వైఖరిని పెంపొందించడానికి గీటురాయి! ఎదుటివారి నుండి పని రాబట్టుకోవడంలో పతాక స్థాయి!  ఈ నైపుణ్యం సాధించగలిగితే విజయం మిమ్మల్ని నీడలా వెంటాడుతుంది. మీరు నిలువెత్తు విజయమవుతారు! విజయ తీరాలకు చెరగని చిరునామా అవుతారు! తథాస్తు!

About challaramaphani

An individual with a progressive attitude.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s